ఆదివాసీలకు కనీస సౌకర్యాలు అందించటమే లక్ష్యం

 

SP Rohith Raju

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
  • 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు మినీ రైస్ మిల్లుల అందజేత
  • సెయిలింగ్ జాతీయ క్రీడాకారుడు ఆడమయ్యకు సన్మానం
  • మావోయిస్టు కుటుంబ సభ్యులకు దుస్తుల పంపిణీ
  • మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు  

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి కనీస సౌకర్యాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. బుధవారం ఆయన చర్ల మండలంలోని 20 మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలకు మినీ రైస్ మిల్లులను అందజేశారు. ఈ సందర్భంగా రాళ్లపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రోహిత్ రాజు మాట్లాడుతూ సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో 20 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మినీ రైస్ మిల్లు కోసం ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ రూ. 2,50,000 ఖర్చైందని తెలిపారు. నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నా రు.తమ తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు వున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్భోధించారు. నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అలాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించ వద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసు శాఖ ఆదివాసీ ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని, లొంగి పోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పని చేసే సభ్యులు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చారు. అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబాన్ని సందర్శించి, ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ( ఆపరేషన్స్ ) నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ తదితరులు పాల్గొన్నారు.


SP Rohith Raju

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి